సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లిలో ఏప్రిల్ 4వ తేదీన జరిగిన సంచలనాత్మక దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 20 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు.
ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 8:00 గంటల సమయంలో, సిద్దిపేటలోని బురుగుపల్లిలో గల డాక్టర్ నివాసంలోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి, ఇంట్లోని వారిని కత్తులతో బెదిరించి, తాళ్లతో కట్టివేసి, నగదు మరియు బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పోలీసుల విచారణలో, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ @ క్రాంతి ఈ దోపిడీకి మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు తేలింది. అతను తన స్నేహితులు మరియు ములుగు, భద్రాచలం ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులతో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు.
నిందితులు రెక్కీ నిర్వహించి, రాత్రి 8 గంటలకు డాక్టర్ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని వారిని బెదిరించి, 8.6 తులాల బంగారం, 1 లక్ష నగదు, ఫోన్లను దోచుకున్నారు. అనంతరం బాధితులను కట్టివేసి పరారయ్యారు.
పోలీసులు నిందితులైన నరేంద్రుల శ్రీకాంత్, కల్లూరి గణేష్, ముత్యబోయిన ప్రేమ్ చంద్, బడిశె పవన్, దుగుట చంద్రశేఖర్, మడిశెట్టి రాజేష్, అక్కపాక శ్యామ్, లాడె ప్రకాష్, మాచర్ల వినయ్ లను అరెస్ట్ చేశారు. వీరి నుండి 4.3 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్, ఒక కారు, 10 ఫోన్లు, యాబై వేల రూపాయల నగదు రికవరీ చేశారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.











