సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం చేర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనా పద్ధతులను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులను సిలబస్ ఎంతవరకు పూర్తయింది, రెగ్యులర్, ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయన్న విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు బాగా నిర్వహిస్తున్నారని, చక్కగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. విద్యార్థులందరికీ ప్రతిరోజూ స్నాక్స్ అందుతున్నాయా, మిడ్‌డే మీల్ నాణ్యత ఎలా ఉంది, అనే విషయాలపై ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరాతీశారు. పాఠశాల హాజరు శాతం, పదవ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్, మాక్ టెస్టులు ఎంతవరకు నిర్వహిస్తున్నారన్న అంశాలను ప్రత్యేకంగా సమీక్షించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మరింత క్రమశిక్షణతో చదువుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈసారి మంచి మార్కులు సాధించి పాఠశాల పేరును, జిల్లా పేరును ఉన్నతంగా నిలబెట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన అకడమిక్ సపోర్ట్ అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288