సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంక్షేమ, ప్రయారిటి రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకులు తప్పనిసరిగా సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి బ్యాంకర్లకు సూచించారు. డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ ఆర్ సీ) సమావేశం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్ఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, నాబార్డ్ ఏజీఎం ఎం.వి. కృష్ణ తేజ, డీసీసీబీ బ్యాంక్ సీఈఓ శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నర్సింగ్ రావు, సంక్షేమ శాఖల అధికారులు, డీఆర్డీఏ, డీఐసీ, తదితర శాఖల అధికారులు, అన్ని బ్యాంకుల నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్డీఎం నర్సింగ్ రావు సాధించిన రుణ లక్ష్యాన్ని వివరించారు. సెప్టెంబర్ 2025 నాటికి పంట రుణాలు రూ.1509.73 కోట్లు (86.29%), మొత్తం వ్యవసాయ రుణాలు రూ.2681.34 కోట్లు (78.67%), ప్రయారిటీ రంగ రుణాలు రూ.4715.43 కోట్లు (89.15%), మొత్తం అడ్వాన్సులు రూ.10676.28 కోట్లు (91.09%) అందించినట్టు ఎల్ డీఎం. వెల్లడించారు. విద్యా రుణాలు, గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ (ఎంఎస్ ఎంఈ) రుణాలు, స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జీ) రుణాలు తదితర అన్ని రంగాల వారీగా లక్ష్యాలు, సాధించిన పురోగతిని బ్యాంకు నియంత్రణాధికారులతో క్లుప్తంగా చర్చించారు. అనంతరం పద్మజారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లాలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథకాల లక్ష్యాల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ ఏజీఎం లక్ష్మి శ్రావ్య మాట్లాడుతూ.. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ (ముద్ర)తో సహా అన్ని ప్రయారిటీ రంగాల్లో రుణాల మంజూరును మరింత పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకులకు కేటాయించిన గ్రామాలలో జనసురక్ష పథకాలైన పీఎంజెడివై, పిఎంజేజెబివై, పిఎంఎస్బివై, అటల్ పింఛన్ యోజన (ఏపీవై) లలో నమోదు ప్రక్రియను నిరంతరం కొనసాగించి, ఎక్కువ మంది లబ్ధిదారులను చేర్చాలని తెలిపారు.అదేవిధంగా రీ-కెవైసీ (Re- కేవైసీ), ఆపరేటివ్ ఖాతాలు అంశాలపై కస్టమర్లకు అవగాహన కల్పించాలని, అలాగే కస్టమర్లు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ చేయని ఖాతాలను తక్షణమే క్లియర్ చేయాలని అన్ని బ్యాంకులకు సూచించారు. నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ మాట్లాడుతూ, వ్యవసాయ మౌలిక వసతుల రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ), పశుపోషణ, మత్స్యకార రుణాలు వంటి రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరును పెంచాలని బ్యాంకర్లకు సూచించారు.
ప్రయారిటీ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఆర్ఓ పద్మజారాణి
Published On: December 23, 2025 7:01 pm