(పీజీఐ) (ప్రశ్న ఆయుధం) జూలై 08
ప్రైవేట్ పాఠశాలల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న తల్లిదండ్రుల విశ్వాసానికి ఇది నిదర్శనమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఈ ఘనతతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి సౌకర్యాల కల్పనతో తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 2025–26 పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో తెలంగాణ 599.70 స్కోర్‌తో దేశంలో 18వ స్థానం సాధించి ‘ప్రచేష్ట-3’ గ్రేడ్‌లో నిలవడం రాష్ట్ర విద్యా రంగ పురోగతికి నిదర్శనమని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం ద్వారా నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా రాష్ట్రంలో తొలి స్థానం సాధించడం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి నిదర్శనమని ఆయన కొనియాడారు.












