విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (CPO) వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన నమూనాను ప్రామాణికంగా తీసుకున్నారు.
తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో, ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని CPOగా నియమిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది.
కామారెడ్డి జిల్లాలో CPOల నియామకంతో పాటు, విద్యార్థుల భద్రత, హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శారీరక శిక్షలు, బుల్లీయింగ్ నివారణ, లైంగిక వేధింపుల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO Act) అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ విధానం ద్వారా కామారెడ్డి జిల్లాలో విద్యార్థులకు సురక్షితమైన, బాలమిత్ర వాతావరణం ఏర్పడింది. జిల్లా బాలల సంరక్షణ విభాగం, న్యాయ సేవా సంస్థలతో సమన్వయం కూడా ఏర్పరచబడింది. ఇప్పుడు ఇదే నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఒక చిన్నారిని దత్తతకు ఇవ్వడం జరిగింది. అనాథ, పరిత్యజించిన పిల్లలకు కుటుంబ ప్రేమ, సంరక్షణ అందించడానికి దత్తత ఒక శ్రేష్ఠమైన మార్గమని కలెక్టర్ తెలిపారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడిందని, పిల్లల హక్కులు, భద్రత, సంక్షేమానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడానికి ప్రజలు దత్తతపై అవగాహన పెంచుకొని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.










