ఫిన్లాండ్లో విద్యాశాఖ ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా పర్యటించిన గాంధారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి భవాని, ఆ దేశ విద్యా విధానం, అక్కడి విద్యారంగ పరిస్థితులపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వివరించారు. ఈ సందర్భంగా శ్రీమతి భవాని మాట్లాడుతూ, ఫిన్లాండ్లోని పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత, వృత్తి విద్యకు కల్పిస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలను కలెక్టర్కు తెలియజేశారు.
ఫిన్లాండ్ విద్యా విధానంలోని ఉత్తమ పద్ధతులను జిల్లాలోని పాఠశాలల్లో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి వినూత్న పద్ధతులను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ విజిట్ విద్యా రంగంలో కొత్త ఆలోచనలకు, మెరుగైన బోధనా పద్ధతులకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఉపాధ్యాయురాలు భవాని ని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, విద్యాశాఖ సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్ కూడా పాల్గొన్నారు.












