నిజామాబాద్, 2026-07-28
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా జరిగిన ఆందోళనల్లో విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి.
విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు ఓమయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్‌లో భాగంగా జిల్లాలోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో నగరంలోని రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను బంద్ చేయడానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులకు యాజమాన్యంతో స్వల్ప వాగ్వాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై యాజమాన్యం వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. అనంతరం యాజమాన్యంతో ఫిర్యాదు చేయించి విద్యార్థి నాయకులపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జిల్లాలో మాత్రం విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పందించి, కేసుల ఉపసంహరణకు కృషి చేయాలని కోరారు.
పోలీస్ కమిషనర్ ఎలాంటి భేషజాలకు పోకుండా విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు, విద్యారంగంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకులపై కక్షపూరిత చర్యలను విరమించుకోవాలని సూచించారు. కేసులు ఉపసంహరించకపోతే వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకుడు వెంకన్నతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.










