రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణ ఆదేశాల మేరకు, 'ప్రజపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 'వెల్ఫేర్ వీక్' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ విద్యా సంస్థల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నారు.
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో 'వెల్ఫేర్ వీక్' నిర్వహణపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ఈ ఏడు రోజుల ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, కిచెన్, శానిటేషన్ సదుపాయాల మెరుగుదల, హాస్టల్ విద్యార్థుల కోసం టాలెంట్ ఫెస్ట్ నిర్వహణ, అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టడం వంటి చర్యలు తీసుకోనున్నారు. తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి, విద్యార్థుల అభివృద్ధిపై చర్చించాలని సూచించారు.
విద్యార్థుల నైపుణ్యాల పెంపునకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు, సమ్మర్ క్యాంప్లు, క్రీడలు, కళలు, చేతిపనుల కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. “బడి బాట” కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో విద్యా పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెల్ఫేర్ వీక్ సందర్భంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదల, శ్రేయస్సు లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలువురు అధికారులు పాల్గొన్నారు.












