తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమైన కవిత, తన రాజకీయ లక్ష్యాలు, ప్రజా సమస్యలపై పోరాటాల గురించి వివరించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. అందరికీ అధికారమని మాట్లాడేవారు దానిని ఆచరణలో పెట్టాలని, తాను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడే తనకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ తన లక్ష్యమని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. మారోజు వీరన్న అనుచరుల మద్దతు తనకు ఎంతో శక్తినిస్తుందని, వారితో కలవడం వల్ల తమను ఆపే శక్తే లేదని ఆమె అన్నారు. బీఆర్ఎస్కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని, అయితే వారి పేర్లను బయటపెట్టనని కవిత తెలిపారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ను ముందుగా టార్గెట్ చేశానని, అందుకే ఆ పార్టీ తనను సస్పెండ్ చేసిందని ఆమె పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేది అధికార పార్టీయే కాబట్టి, కాంగ్రెస్‌ను టార్గెట్ చేశానని, ఆయా సమస్యల ఆధారంగా బీఆర్ఎస్పైన కూడా మాట్లాడుతానని అన్నారు. పరిగిలో రైతు దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ అయ్యారని కవిత విమర్శించారు. పోలీసులు హరీశ్‌రావును పరిగిదాకా కూడా వెళ్లనివ్వలేదని ఎద్దేవా చేశారు. తాము పరిగి వెళ్లి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నామని, పోలీసులు తమను అరెస్టు చేశారని, అయినప్పటికీ రైతులకు మద్దతుగా నిలిచామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ పోరాటం కొనసాగిస్తానని కవిత పేర్కొన్నారు.











