రిజర్వేషన్ల కారణంగా సీటు వచ్చిందంటూ సీనియర్ల వేధింపులు, అధిక డ్యూటీలతో మానసిక ఒత్తిడికి గురైన ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ఒక గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ, నిందితులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెందిన కాట్రావత్ సురేష్ నాయక్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించి, మూడు నెలలుగా కాలేజీ క్వార్టర్స్‌లో నివసిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, కొందరు సీనియర్లు అతన్ని తరచూ కులంపేరుతో దూషిస్తూ, కావాలనే ఎక్కువ డ్యూటీలు వేస్తూ మానసికంగా హింసించినట్లు అతని తల్లి నాగమణికి పలుమార్లు చెప్పి బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న నాగమణి సోదరుడు రవి, హాస్టల్ వద్దకు వెళ్లి సురేష్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ర్యాగింగ్ చేస్తున్న వారిని కలిసి మాట్లాడతానని చెప్పగా, 'నేనే చూసుకుంటాను, మీరు రావద్దని' సురేష్ నాయక్ చెప్పినట్లు సమాచారం. గురువారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని తల్లికి ఫోన్ చేసిన సురేష్, 9 గంటలైనా గది తలుపు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తమైంది.
అతని స్నేహితురాలు అమూల్య గది వద్దకు వెళ్లి చూడగా, సురేష్ అపస్మారక స్థితిలో కనిపించారు. గదిలో నిద్రమాత్రలు, చేతికి మత్తు ఇంజెక్షన్ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో చదువుకున్న తన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో తల్లి నాగమణి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
తమ కుమారుడి మరణానికి సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపిస్తూ, సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులపై వెంటనే హత్యకేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో ర్యాగింగ్ సమస్యపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.







