*నాయకులుగా ఎదగాలంటే డబ్బులు కాదు – కష్టాల్లో ప్రజలను ఆదుకోవాలి.*
*ఐక్యతతోనే హక్కులు సాధ్యం:*
*కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి*
సిద్దిపేట/గజ్వేల్, డిసెంబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కురుమ రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి ఆధ్వర్యంలో కురుమ సంఘ నాయకులు, ప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి నూతనంగా ఎన్నికైన 55 మంది సర్పంచులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయవాద భావజాలం తెలంగాణలో గ్రామగ్రామాన విస్తరిస్తోందని, జాతీయ వాదమే దేశానికి అతిపెద్ద బలమైన శక్తి అని స్పష్టం చేశారు. పార్లమెంటులో తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టం రైతులు, రైతు కూలీలకు గణనీయమైన లాభాలు చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో దళారీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చి రైతులను నగదు పంపిణీతో మభ్య పెట్టారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు, రైతు కూలీలకు అందాల్సిన ఆర్థిక సహాయం నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతుందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో దళారీ వ్యవస్థకు, అవినీతికి ఎలాంటి చోటు లేదని ఖరాఖండీగా చెప్పారు. నాయకుడు కావాలంటే డబ్బు అవసరం లేదని, ప్రేమ–ఆప్యాయతతో ప్రజలతో మమేకమై ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే అదే నిజమైన నాయకత్వానికి ప్రమాణమని సూచించారు. రైతు వేరు కాదు, రైతు కూలీ వేరు కాదు, ఇద్దరూ ఒకే కుటుంబం అన్న భావనతోనే కేంద్ర ప్రభుత్వం విధానాలు అమలు చేస్తోందని తెలిపారు. దేశభక్తి భావనతో యువత పెద్ద సంఖ్యలో బీజేపీలోకి వస్తుండటం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి మాట్లాడుతూ.. కురుమ కులంలో పుట్టి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ గవర్నర్ స్థాయి వరకు ఎదిగిన బండారు దత్తాత్రేయ అడుగుజాడల్లోనే నేడు కురుమలు నడుస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో వెనుక బాటుతనం ఎదుర్కొన్న కురుమ సమాజం నుంచి ఇప్పుడు యువతతో పాటు అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి ముందుకు రావడం ఆశాజనక పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై జీవించే వ్యక్తి బండారు దత్తాత్రేయ అని అన్నారు. ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా ప్రజల మధ్యే ఉండాలనే తాపత్రయం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని తెలిపారు. అజాతశత్రువుగా ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్గా సేవలందించి అనేక మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన వ్యక్తి దత్తాత్రేయ అని ప్రశంసించారు. అలాంటి మహానాయకుడిని ఈ రోజు సన్మానించడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, కప్పర ప్రసాదరావు, ఎల్లు రామ్ రెడ్డి, మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులతో పాటు కొత్తపల్లి నూతన సర్పంచ్ శ్యామల మల్లేశం కురుమ, ఉప సర్పంచ్ కొమురయ్య కురుమ, వార్డు సభ్యులు సురేష్, కుమార్ కురుమ, పుల్ల బీరయ్య, పులి బాలచంద్రం, మాజీ సర్పంచులు ఐలయ్య, రాములు, బొమ్మ బాలయ్య, సంగేపు అనిల్, గుంటి రాజు తదితర కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.