అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే పక్షోత్సవాల సందర్భంగా, "99 రోజుల ప్రజా పాలన" కార్యక్రమంలో భాగంగా నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీసీ) ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పచ్చదనం పెంచాలని ఆమె పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండుతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూమిని కాపాడుకుందాం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, పచ్చదనం పెంచుదాం వంటి నినాదాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు.
ప్రకృతి సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్ల పెంపకం, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, యువత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే భూమి సంరక్షణ సాధ్యమవుతుందని, పర్యావరణ హిత చర్యలను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త మాధవ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












