నర్సాపూర్, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) ఆధ్వర్యంలో ‘వేస్ట్ టు వెల్త్’ అనే అంశంపై ఎన్ జీసీ మెదక్ ఆధ్వర్యంలో నర్సాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలుర నర్సాపూర్ పాఠశాల ఆవరణలో పర్యావరణ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ డివిజన్ ఆర్డీఓ శ్రీ మహిపాల్ విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి, మాట్లాడారు. పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడడంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. భవిష్యత్తు తరాలకు శుభ్రమైన ప్రకృతిని అందించాలంటే ఇప్పటి నుంచే పర్యావరణ స్పృహతో జీవనశైలిని మార్చుకోవాలని, ప్లాస్టిక్ రహిత జీవనం, ఆరోగ్య కరమైన అలవాట్లను అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు. నర్సాపూర్ తహసిల్దార్ శ్రీనివాస్ ప్రదర్శనలు సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ జీసీ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం. రాజశేఖర్, ఎన్ జీసీ జిల్లా కోఆర్డినేటర్ ఎన్.శ్రీనివాస్, జిల్లా రిసోర్స్ పర్సన్ డి. ప్రసన్నకుమార్ పాల్గొని, విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు ఎంఈవో తారా సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేశం, సీనియర్ ఉపాధ్యాయులు సామ్యా నాయక్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి – ఎం. భవాని (మోడల్ స్కూల్, జక్కపల్లి), ద్వితీయ బహుమతి బి.వర్షిని, కె. శ్రీనివాస్ (IRC భవిత స్కూల్),తృతీయ బహుమతి – ఎం.శ్రావణి (మోడల్ స్కూల్, చేగుంట), ఉన్నత పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి – ప్రశాంత్, సమీర్ (ZPHS, శివంపేట), ద్వితీయ బహుమతి – కృష్ణ మనోహర్ (ZPHS, మాసాయిపేట్), తృతీయ బహుమతి – ఎం. శ్రీజ (ZPHS, కౌడిపల్లి), అలాగే ప్రశంసా బహుమతులు యశశ్రీ, కీర్తన (గీతా హై స్కూల్, నర్సాపూర్), రితిక, సకిన (ZPHS బాయ్స్, నర్సాపూర్) విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు.
నర్సాపూర్‌లో ‘వేస్ట్ టు వెల్త్’పై పర్యావరణ ఎగ్జిబిషన్
Published On: December 23, 2025 10:23 pm