అర్హతలేని వైద్యుల క్లినిక్‌లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కొరడా విసిరారు. ఆర్మూర్ పట్టణంలో అనుమతులు లేని రెండు క్లినిక్‌లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రూ కాలనీలో ప్రియాంక క్లినిక్, భారతి క్లినిక్‌లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. వైద్య అర్హతలు లేకుండానే కొందరు వ్యక్తులు వైద్యులుగా చెలామణి అవుతూ అమాయక ప్రజలకు చికిత్స పేరుతో మోసగిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. దీనితో ఈ రెండు క్లినిక్‌లను సీజ్ చేశారు.
గతంలో కూడా ఈ క్లినిక్‌లపై చర్యలు తీసుకుని సీజ్ చేయడంతో పాటు, నిర్వాహకుడు సమీర్ రాయ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో విచారణ జరిపి, అక్రమ కార్యకలాపాలు నిర్ధారించుకుని క్లినిక్‌లను మూసివేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని సూచించారు. నకిలీ వైద్యులను నమ్మి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరించారు. అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
క్లినిక్‌లు సీజ్ చేసినప్పటికీ, వెనుక ద్వారాల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని క్లినిక్‌లను పూర్తిగా మూసివేసి, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తనిఖీల్లో డీఎంహెచ్‌వోతో పాటు పలువురు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












