ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఘట్కేసర్లో పలు ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. యోగా, 'ఈట్ రైట్ వాక్' ర్యాలీ, ఆహార భద్రతపై శిక్షణ వంటివి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి.
ఘట్కేసర్ పట్టణంలో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రజల్లో నివారణాత్మక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, సరైన ఆహారపు అలవాట్లతో శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
ఉదయం 7 గంటలకు ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో యోగా కార్యక్రమం జరిగింది. యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీధర్ బృందం ఆధ్వర్యంలో సుమారు 200 మంది పాల్గొని వివిధ ఆసనాలు చేశారు. అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి 'ఈట్ రైట్ వాక్' ర్యాలీని ప్రారంభించారు. సురక్షితమైన ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని, పోషకాహారం ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆమె సూచించారు. ఈ ర్యాలీలో మెడికల్, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతాయపల్లి ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ అధ్యక్షతన ఫోస్టాక్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్ల వంట మనుషులు, మధ్యాహ్న భోజన పథక వంటకారులు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. హాస్టళ్లలో వడ్డించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డా. సత్యవతి, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. చంద్రకళ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా. కౌశిక్, ఘట్కేసర్ ఎస్ఎంఓ డా. జంగయ్య, డా. శ్రీవల్లి, ఫుడ్ సేఫ్టీ అధికారులు ధర్మేంద్ర పాల, పి. నిలీషా తదితరులు పాల్గొన్నారు.











