మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కల్హేర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'తొలి వెయ్యి రోజులు – బంగారు భవిష్యత్తుకు పునాది' అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించారు.
ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిశువుల శారీరక, మానసిక, మేధో వికాసానికి తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని ఆమె నొక్కి చెప్పారు. ఈ దశలో తల్లి ఆరోగ్యం, సరైన పౌష్టికాహారం, వైద్య పరీక్షలు, టీకాలు, పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.
గర్భిణీ స్త్రీలు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే శ్రేయస్కరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్య వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం, పోషణ, బాలల సంరక్షణ, బాల్య వివాహాల నివారణ, మహిళల సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.








