అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలో గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు, ముఖ్యంగా యువతకు సూచించారు.
జిల్లా పరిపాలన, పోలీసు, ఎక్సైజ్, సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, దేశాభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిఘా కొనసాగుతోందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాజ సహకారంతోనే కామారెడ్డిని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు.
కార్యక్రమంలో భాగంగా, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి కుమారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












