ప్రస్తుత కాలంలో నరాల బలహీనతతో బాధపడుతున్న వారి కోసం కుభీర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ సంతోష్ పేండ్కర్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఆహార నియమాలు, ఆయుర్వేద మూలికలు, యోగా ద్వారా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ఆయన తెలిపారు.
డాక్టర్ సంతోష్ పేండ్కర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆహారంలో ఉప్పు, కారం తగ్గించడం వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి అవి బలపడతాయి. అశ్వగంధ, శతావరి వంటి మూలికలు, విటమిన్ B12 సమృద్ధిగా ఉండే ఆహారాలు, పాలు, బాదం, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల నరాల శక్తి పెరుగుతుంది.
శీర్షాసనం వంటి యోగాసనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి నరాలను బలపరుస్తాయని డాక్టర్ పేండ్కర్ పేర్కొన్నారు. అశ్వగంధను పాలతో తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుముఖం పడుతుందని, శతావరి నరాల వ్యవస్థను ప్రశాంతపరిచి బలాన్ని పెంచుతుందని ఆయన వివరించారు.
నాడీ బలానికి తైలాలు కూడా ఉపయోగపడతాయని, నువ్వుల నూనె లేదా మహానారాయణ తైలంతో మసాజ్ చేసుకోవడం వల్ల నరాల నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయని తెలిపారు. ఆహారంలో బాదం, జీడిపప్పు, అక్రోట్లు, ఆకుకూరలు, అరటిపండు, బొప్పాయి వంటివి చేర్చుకోవాలని సూచించారు. విటమిన్ B12, మెగ్నీషియం అధికంగా ఉండే డార్క్ చాక్లెట్లు, అవకాడో వంటివి కూడా మేలు చేస్తాయని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడక, యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని డాక్టర్ పేండ్కర్ తెలిపారు. పొగత్రాగడం నరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, నరాల బలహీనత ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయాలని సూచించారు. తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు.











