గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వైద్యులు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్స ఉచితంగా అందించబడింది.
పది కిలోల బరువున్న బాలుడికి, అతని తండ్రి లివర్‌లోని కొంత భాగాన్ని సేకరించి అమర్చారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స సుమారు 14 గంటల పాటు కొనసాగిందని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను ఉస్మానియా వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో ఇలాంటి అత్యాధునిక శస్త్రచికిత్సలు జరగడం అత్యంత అరుదని వారు పేర్కొన్నారు.
ఈ విజయంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి, ఉస్మానియా వైద్యుల బృందాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఇలాంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.











