రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అవయవ మార్పిడి (THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, అవయవ దానాలను ప్రోత్సహించడం, చికిత్సల ధరల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమర్థవంతమైన అమలుపై కీలక చర్చలు జరిగాయి.
సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, మంత్రి దామోదర్ రాజనర్సింహ అవయవ మార్పిడి చికిత్సల ఖర్చులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని, రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ సమర్థవంతంగా అమలు అయ్యేలా సమగ్ర పాలసీ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర దేశాల నుండి వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలు రూపొందించాలని కూడా సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కాకుండా ఆసుపత్రులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై కూడా మంత్రి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. ఈ చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని, ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులు సామాన్యులకు భారం కాకుండా ఉండాలని సూచించారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సలకు అయ్యే టారిఫ్ పై నియంత్రణ ఉండేలా కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు.

