ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ (ఐఏఎస్) అధికారులను ఆదేశించారు.
శనివారం మల్కాజిగిరిలోని బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించిన శాఖల వారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జీవో నెం. 3 ప్రకారం ప్రతి సోమవారం నియోజకవర్గాల వారీగా ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అక్కడ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
రెవెన్యూ, మున్సిపల్ శాఖలు ధరణి పెండింగ్ దరఖాస్తులు, మ్యుటేషన్లను వంద శాతం పూర్తి చేయాలని, వార్డుల వారీగా పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచనలు జారీ చేశారు.
సివిల్ సప్లైస్ శాఖ కొత్త రేషన్ కార్డుల జారీ, ఈ-కేవైసీ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
వైద్య శాఖ బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేకుండా చూడాలని, విద్యుత్ శాఖ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారుల నమోదును వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్ శాఖ డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి శాంతిభద్రతల విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











