రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకున్న గృహాలను సోమవారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరడంతో వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
జిల్లా కేంద్రంలోని అడ్లూరి ఎస్సీ కాలనీలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణితో కలిసి లబ్ధిదారుల నూతన గృహంలో గృహప్రవేశం చేశారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిచేసుకున్న ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో నిరుపేద కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం సంతోషకరమని, గృహ నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేసి నూతన గృహాల్లోకి ప్రవేశించడం అభినందనీయమని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
సొంత ఇంటి కల సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు గృహ వసతి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.











