తెలంగాణలోని ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం నిర్మించబడుతుందని, పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేక ఎన్క్లేవ్ ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు ఇప్పటికే 360 ఎకరాల ఎయిర్‌స్ట్రిప్ ఉందని, పూర్తిస్థాయి విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించాలని మంత్రి తెలిపారు. ఎయిర్‌బస్ A320 వంటి పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేస్తారు.
ఈ ప్రాజెక్టుపై ఏప్రిల్ 17న రక్షణ శాఖ, AAI, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. అనంతరం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి, రక్షణ శాఖ ఆమోదం పొందిన తర్వాత, భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణం ప్రారంభమవుతుంది.
ఈ విమానాశ్రయం ఆదిలాబాద్ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌కు సమీపంలోని విమానాశ్రయాలు హైదరాబాద్ (300 కి.మీ), నాగ్‌పూర్ (170 కి.మీ) దూరంలో ఉన్నాయి.
ఇదే సమావేశంలో వరంగల్ మామన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కు మూడు నెలల్లో శంకుస్థాపన, పెద్దపల్లి ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదిత స్థలంపై సానుకూల నివేదిక, కొత్తగూడెం విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం వంటి అంశాలను కూడా సమీక్షించారు.











