సంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పాడి గేదెల పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
2025-26 వార్షిక సంవత్సరానికి గాను ఉపాధి కల్పన లక్ష్యంతో ఈ పథకాన్ని అందిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీయస్ బీ రామాచారి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హతలు, పత్రాల వివరాలను ఆయన వెల్లడించారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పట్టేదార్ పాస్ బుక్ తప్పనిసరి. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. పాడి గేదెల పోషణకు కనీసం 10 గుంటల భూమి ఉండాలి లేదా గడ్డి కొనుగోలు చేసి పోషించగల సామర్థ్యం ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేసి, దాని ప్రింట్‌ను సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో (గ్రామీణ ప్రాంతాలు) లేదా మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో (పట్టణ ప్రాంతాలు) సమర్పించాలి.








