రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం పేరుతో ఈ బిల్లును హోంశాఖ ప్రవేశపెట్టనుంది.
లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లుకు స్థానం కల్పించడంతో, అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువెళ్తారు.
గత నెల 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించి, దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ తీర్మానం ఆధారంగానే కేంద్రం బిల్లును ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై వివిధ రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.











