నిరుద్యోగుల సమస్యను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ ప్రకటనల్లో వైరుధ్యాలు ఉన్నాయని జాగృతి యువజన విభాగం ఉపాధ్యక్షులు రవి రాథోడ్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల మద్దతే కీలకమని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రవి రాథోడ్ అన్నారు. సారా గురించి మాట్లాడే సమయం ప్రభుత్వానికి ఉందని, కానీ నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి గతంలో 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, ఆ తర్వాత శాసనసభలో 16,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారని, ఇది ఆయన మాటల్లోని వైరుధ్యాన్ని స్పష్టం చేస్తోందని రాథోడ్ ఎత్తి చూపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురై, ఇప్పటివరకు 20 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.
జాగృతి తరఫున నిరుద్యోగులకు అండగా నిలుస్తామని, వారి కోసం పోరాటం కొనసాగిస్తామని రవి రాథోడ్ ప్రకటించారు. నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దని ఆయన సూచించారు.







