భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పిలుపునిచ్చారు.
మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంబేడ్కర్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కలెక్టర్ సూచించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
జయంతి వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కలెక్టర్ అధికారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి దయానంద్, సీపీఓ జీవరత్నం, డి.ఈ.ఓ భోజన్న, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












