నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆర్మూర్‌లోని ఎస్ఎస్కే ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "మళ్లీ కారే కావాలి.. కేసీఆర్‌నే కావాలి" అనే నినాదం ప్రజల్లో బలంగా వినిపిస్తోందని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన తెలుపుతున్నారని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన విమర్శించారు. రైతులు పండించిన వడ్లు, మక్కలను సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌లో రాక్షస పాలన కొనసాగుతోందని, మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనను కూడా పట్టించుకునే పరిస్థితి లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలను వినిపించిన ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, సోషల్ మీడియాలో మాట్లాడినా కేసులు నమోదు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేసి రైతన్నల గుండెల్లో నిలిచిపోయిందని, రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేసిందని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.











