కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య కుమ్మక్కు ఉందని, అందుకే కేటీఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి సీఎం వెళ్లడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరిపితే బండారం బయటపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కేవలం అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, హరీశ్ రావును మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఆయనపై ఉన్న పగతోనే కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాట్లాడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్‌పై సీఎం రేవంత్‌కు ఉన్నంత పగ లేదని, అందుకే ఫార్ములా రేసులు, డ్రగ్స్, ఫాంహౌస్ కేసులపై సీఎం రేవంత్ మాట్లాడటం లేదని గుర్తు చేశారు. కేటీఆర్‌పై రేవంత్ ప్రేమ ఒలకబోస్తున్నారని, భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని జోస్యం చెప్పారు.
కేసీఆర్‌పై ఉన్న కోపం కూడా రేవంత్‌కు పోయిందని, ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని, అందుకే హరీశ్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని, కేటీఆర్ గురించి మాట్లాడటం లేదని వివరించారు. కాళేశ్వరంపై మాత్రమే సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని, మరి మిగతా అవినీతి కేసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయలకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డే చెప్పినప్పుడు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ ఎందుకు జరపాలని పట్టుబడుతున్నారని సందేహం వ్యక్తం చేశారు. అందులోనే హరీష్ పాత్ర ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నామమాత్రపు సీఎం అని, పాలన అంతా కేటీఆర్‌దేనని అన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన సంగతి మర్చిపోయారని, ఆ పౌరుషం, రోషం కూడా పోయిందని, ఎందుకంటే ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని చెప్పారు. ఇకపై కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతిపై విచారణ జరిపే అవకాశమే లేదన్నారు. మైన్స్ స్కాం జరిగింది.. విచారణ అంటున్నారు.. ఇది కేవలం పదేళ్లు దోచుకున్నారు.. ఇక మేం దోచుకుంటాం.. నోరు మెదపవద్దని భయపెట్టడానికే ఈ తూతూ మంత్రపు విచారణ అని, సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని అభివర్ణించిన బండి సంజయ్, బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ పెద్ద అవినీతి పరుడని తెలిసినా రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగదని, కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ ఇటీవల రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారని, అట్లాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు.
డీలిమిటేషన్ చేస్తామని, 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పే సరికి సీఎం రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైందన్నారు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా తమకు ఉండదని, బీజేపీకి అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నగదు సమకూరుస్తున్నదే సీఎం రేవంత్ రెడ్డి అని, ఈ సారి కర్ణాటక నుంచి డీకే శివకుమార్ నగదు పంపడం లేదని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదన్నారు. అసోం, బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, కేరళలోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, స్థానిక ప్రజలంతా బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై స్పందించిన బండి సంజయ్, అసలు ఎథిక్స్ కమిటీనే లేదని, లేని కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి అంశం రికమెండ్ చేయడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదని అభిప్రాయపడ్డారు.







