తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో పాల్గొనబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. 'మావి వేరే గేమ్స్, కేటీఆర్వి మరో రకమైన గేమ్స్' అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మైదానంలోకి తాము రావడం లేదని కేటీఆర్ అంటుంటే తామేం చేయగలమని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు ఆడే గేమ్స్ పెట్టడం సాధ్యం కాదని ఆయన చురకలు అంటించారు. తాము ఫిట్ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఆరోగ్య తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రజాప్రతినిధులు క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు డ్రగ్స్ వంటి ఆలోచనలు రాకుండా ఆటల వైపు మళ్లుతారని వాకిటి పేర్కొన్నారు. కాగా, ఈరోజు నుంచి రెండ్రోజులపాటు జరిగే లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్-2026లో తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనరని కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా క్రీడా పోటీలు అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. శాసనసభ సమయం వృథా చేయడం తగదని, కనీసం మరో 10 రోజులు సమావేశాలను కొనసాగించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రీడా పోటీలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.