నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో పియుసి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లిపుడు తేజస్విని, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై విద్యార్థులు క్యాంపాస్ లోని వైద్య సదుపాయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన తేజస్విని, అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఇంటికి వెళ్లింది. ఈ నెల 13వ తేదీన జ్వరం రావడంతో ట్రిపుల్ ఐటి ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
క్యాంపాస్ లోని వైద్య సదుపాయాలు సరిగా లేవని, డయాగ్నోస్టిక్ పరికరాలు అధునాతనంగా లేవని, దీనివల్ల విద్యార్థిని ఆరోగ్యం క్షీణించినా సకాలంలో గుర్తించలేకపోయారని TSAS విద్యార్థులు ఆరోపించారు. వైద్య సేవల్లో ఆలస్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, ట్రిపుల్ ఐటిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, అధునాతన డయాగ్నోస్టిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ సంఘటన విద్యార్థుల భద్రత, క్యాంపాస్ లోని మౌలిక సదుపాయాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. తక్షణమే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.











