జన్నారం మండలం, చింతలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేయడంతో గర్భిణితో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జన్నారం మండలం, చింతలపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా దాడి చేసిన వీధి కుక్కలు గట్టు రాజన్న, గట్టు రాము, మేట్టుపల్లి గంగా, జమున, బుర్రగడ్డ అమ్మాయిలను తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో మూడు సంవత్సరాల బాలుడు మరియు నిండు గర్భిణి మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
బాధితులను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో వీధి కుక్కల సమస్యపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జన్నారం మండలం పరిధిలోని అనేక గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉందని, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లడానికి భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. వీధి కుక్కలు వాహనాల వెంటపడటం, అకస్మాత్తుగా దాడి చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు తెలిపారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు అధికారులు హామీ ఇవ్వాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.







