రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేదల వైద్యం కోసం గత 27 నెలల్లో రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల వైద్యానికి నిధుల కొరత లేకుండా అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను ఆయన శాసనసభ ముందు ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన SEEEPC సర్వే ప్రకారం, తెలంగాణలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు జీవిత బీమాను అందించి, వారిలో ధీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గత 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో CMRF కింద రూ.2046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.2,400 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన రూ.600.27 కోట్ల బకాయి భారాన్ని మోస్తూనే, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రూ.2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించామని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,480.52 కోట్లు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమాను తీసుకురావడం ద్వారా పేదల్లో ధీమా కల్పించాలన్న సంకల్పంతోనే ఈ చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నిమ్స్, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు, రూ.3 వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రిని కలిపి, రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నామని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.







