సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటిఘనాపూర్‌లో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఏర్పాటు చేసిన లేఔట్లను హైడ్రా అధికారులు తొలగించి, 92 ఎకరాల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కులు, రహదారుల ఆక్రమణలను తొలగించి, 47,840 గజాల ప్రభుత్వ స్థలానికి విముక్తి కల్పించారు.
స్థానికుల ఫిర్యాదుల మేరకు హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలపై భారీ స్థాయిలో తొలగింపు చర్యలు చేపట్టింది. 1980లో ఆనందనగర్ కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన లేఔట్లో పార్కులు, రహదారులను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఈ లేఔట్‌ను వ్యవసాయ భూమిగా మార్పు చేసి, ఫేక్ పాస్‌బుక్స్ సృష్టించి విక్రయాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
పూర్తి సర్వే అనంతరం, అధికారులు ప్రీకాస్ట్ బ్రిక్స్ ప్రహరీలు, షెడ్లను తొలగించారు. స్వాధీనం చేసుకున్న పార్క్ స్థలాల్లో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసి, రహదారుల హద్దులను నిర్ధారించారు. పార్క్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించారు.
ఈ ఆక్రమణల తొలగింపుతో ప్రభుత్వానికి చెందిన 92 ఎకరాల భూమి తిరిగి దక్కింది. ఇది ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా చేపట్టిన కీలక చర్యగా అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.











