కామారెడ్డి, జూలై 16
ఎల్నినో ప్రభావంతో రానున్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, విద్యార్థుల ప్రవేశాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్య, వాతావరణ పరిస్థితులు, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని, త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల లక్ష్యాలను పూర్తిచేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఐడీఓసీలో జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే మెట్టపంటలు, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతు వేదికల ద్వారా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో ప్రవేశాల లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, పాఠశాలల పరిసరాల్లో దోమల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా నీటి వనరులను సమర్థంగా వినియోగించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి కింద వచ్చిన దరఖాస్తులను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల వారీగా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.












