కామారెడ్డి, 09.07.2026
ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, జిల్లాలో వరి విస్తీర్ణం తగ్గించి ఆరుతడి పంటల వైపు మళ్లాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం "ఎల్-నినో" ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, జిల్లాలో నీటి ఆవశ్యకత అధికంగా ఉన్న వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించాలని, రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన దిశా నిర్దేశం చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా, మొక్కజొన్న, సోయా, పెసర్లు, అలసందలు, మినుములు, కందులు, పత్తి, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలను ఎంచుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రధాన రిజర్వాయర్లైన నిజాంసాగర్, పోచారం, కౌలాస్ నాలాలో నీటి నిల్వ సామర్థ్యం, ప్రవాహం తక్కువగా ఉన్నందున వరి సాగును తగ్గించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
రైతు వేదికల్లో వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి, రైతులకు ఆరుతడి పంటల ప్రాముఖ్యత, సాగు పద్ధతులు, ప్రభుత్వ సహాయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.












