జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఖానాపూర్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి, ధాన్యం దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియలను, నిల్వ విధానాలను పరిశీలించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఖానాపూర్లోని లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లు, శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరిన ధాన్యం పరిమాణం, దిగుమతి సమయపాలన, మిల్లింగ్ శాతం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వ విధానాలను, ధాన్యంలో తరుగు తీస్తున్నారా అనే అంశాన్ని కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాల ముప్పు నేపథ్యంలో, ధాన్యం తడిసిపోకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే అదనపు హమాలీలను నియమించి పనులు వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు.
మిల్లుల సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేపట్టాలని, ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. అవసరమైతే సమీప రైతు వేదికలను కూడా వినియోగించుకోవాలని సూచనలు జారీ చేశారు. ధాన్యం దిగుమతుల్లో జాప్యం జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి. మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు కలెక్టర్‌తో పాటు పాల్గొన్నారు.












