కామారెడ్డి పట్టణంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సుమారు 40-50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రైలు కింద పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం, ఉదయం 9.40 గంటల సమయంలో ట్రాక్ నంబర్ 513/9-10 వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు సుమారు 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉన్నాడు. అతని కుడి చేతిపై "జే నర్సింలు" అనే పచ్చబొట్టు, అదే చేతికి వెండి కడియం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మెడలో నల్లని దారంతో రాగి తాయెత్తు ఉన్నట్లు తెలిపారు.
మృతుడు తెలుపు రంగు, గోధుమ రంగు పూల డిజైన్ ఉన్న షర్టు, గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైల్వే ఎస్సై సాధు లింబాద్రిని 87126 58614 నంబర్లో సంప్రదించవచ్చు.












