దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా కొత్తగూడెం ఐడీఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభ సభాపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విశిష్ట పాత్ర పోషించారని కొనియాడారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవప్రదమని తెలిపారు.
శ్రీపాదరావు 1935, మార్చి 2న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సేవలో చురుగ్గా పాల్గొని, ధన్వాడ గ్రామ సర్పంచ్‌గా, మంథని నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన నిష్పాక్షికత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో సభా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని, పార్టీలకు అతీతంగా గౌరవం పొందారని వివరించారు.
గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమైనదని, సరళత, సమగ్రత, నిబద్ధత ఆయన వ్యక్తిత్వ లక్షణాలని కలెక్టర్ పేర్కొన్నారు. 1999 ఏప్రిల్ 13న జరిగిన ప్రమాదంలో శ్రీపాదరావు మరణించారు. ఆయన ప్రజా సేవ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

