షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా కొంకటి కృష్ణ నియామకం జరిగింది. పాల్వంచలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో మంగళవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా కొంకటి కృష్ణ ను ఏకాగ్రీవంగా ఎంపిక చేశారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
కొత్తగా నియమితులైన కొంకటి కృష్ణ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో తొలగించిన స్థానిక రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ జనాభా పెరిగిందని, జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ ను 20% పెంచాలని ఆయన కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం ఎస్సీలందరినీ ఏకం చేసి, స్వతంత్ర హక్కుల పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కృష్ణ అన్నారు. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, రాష్ట్ర గౌరవ సలహాదారు ఎస్ వెంకటేశ్వర్లు, సలిగంటి కొమరయ్య వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

