ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ తమ సొంత జిల్లాల్లో పనిచేయకూడదనే నిబంధనను వెంటనే తొలగించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధన వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ శాఖ ఇటీవల విడుదల చేసిన బదిలీ నిబంధనలలో, ఉద్యోగులు తమ సొంత జిల్లాల్లో పనిచేయరాదనే నిబంధన 8(f)ను చేర్చడం వివాదాస్పదమైంది. కిందిస్థాయి ఉద్యోగులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు.
ఈ నిబంధన వల్ల సంగారెడ్డి జిల్లాకు చెందిన 150 మందితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3000 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నవారు కూడా ఈ నిబంధనతో ఇబ్బందులు పడతారని, ఇది వారి కుటుంబాలపై, పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి, వెంటనే నిబంధన 8(f)ను తొలగించాలని జగ్గారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. తమను కలిసి సమస్యను వివరించిన ఉద్యోగుల తరపున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
సమయాభావం, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే ఈ నిబంధనను ఎత్తివేసి, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా బదిలీలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.










