తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, కవిత వేరు కుంపటి పెట్టుకోవడంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు దూరమై ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని తెలిపారు.
ఎన్నికల సమయంలో బీజేపీ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, అయితే ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నందున ఆ పార్టీని దూరం పెడుతున్నారని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం ఉందని, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, రాష్ట్రంలో 100 సీట్లు గెలుచుకుంటుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.










