ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు.
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంబంధిత అధికారుల నుంచి ఆయన ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తి వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు.
ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఓటరు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను బాధ్యతగా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరించి ఎస్ఐఆర్ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా చొరవ చూపాలని గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు. "మన ఓటు – మన హక్కు, మన బాధ్యత. ప్రతి ఓటరిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.












