హుజురాబాద్ పట్టణానికి సమీపంలో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుపై వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన దీక్షలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, ప్రాజెక్టు నుంచి వెలువడే రసాయనాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయని, ఇది 25 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
చెత్తను కాల్చడం వల్ల వెలువడే విషవాయువులు గాలిని కలుషితం చేసి, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు, దీర్ఘకాలిక జబ్బులకు దారితీస్తుందని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని లేదా జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఏకమై ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.







