జగిత్యాల జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పాల్గొంటారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగనున్న ఈ బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో టీ. జీవన్‌రెడ్డి, కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, మోతే రోడ్డు ప్రాంతాలను నాయకులు పరిశీలించి, సభకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ బహిరంగ సభలో పలువురు ప్రముఖులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోని రైతుల సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. టీ. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.










