మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలంగాణ జాగృతి బీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం లేక్ వ్యూ పార్క్ లోని పూలే విగ్రహ ప్రాంగణంలో జాగృతి నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలంగాణ జాగృతి బీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం ఐ మ్యాక్స్ ఎదురుగా గల లేక్ వ్యూ పార్క్ లోని పూలే విగ్రహ ప్రాంగణంలో జాగృతి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి పూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ప్రచారం చేసుకుని, ఆయన జయంతి రోజైన శనివారం నాటికి కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని వారు మండిపడ్డారు.
తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి బీసీలంటే చులకన అని, మహత్మా పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాన్ని పెట్టే కుటిల యత్నం చేశారని ఆరోపించారు. గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మోసం చేశాయని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో బీసీలకు స్థానం లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెండేళ్లుగా బీసీల కోసం పోరాటం కొనసాగుతుందని, ఇకపై బీసీలను మోసం చేసే ప్రయత్నాలు చెల్లవని స్పష్టం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసిందని జాగృతి అధికార ప్రతినిధి పడాల మనిజా గౌడ్ అన్నారు. మహిళ బిల్లులో బీసీలకు సబ్ కోటా అని అడుగుతున్న ముఖ్యమంత్రి ముందు, కాంగ్రెస్ గతంలో ఇస్తామని చెప్పిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలలో చైతన్యం పెరిగిందని, గతంలో మాదిరిగా మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీసీ జాగృతి అధ్యక్షుడు ఎత్తరి మారయ్య హెచ్చరించారు.










