జనగణన–2027 తొలి విడతలో భాగంగా నిర్వహించనున్న ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను సమర్థవంతంగా, ఖచ్చితంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై ఆమె మార్గనిర్దేశం చేశారు.
సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ, ఇండ్ల గణన అనేది జనగణనలో అత్యంత కీలకమైన దశ అని, దీనిని లోపాలు లేకుండా అమలు చేయాలని నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ విధానంలో గణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ జనగణన నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ఈ సమయంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ముందస్తు సన్నాహక చర్యలను వెంటనే ప్రారంభించాలని, యాప్ వినియోగంలో తలెత్తే సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి, ఎన్యుమరేటర్ బ్లాకులు, హౌస్ లిస్టింగ్ బ్లాకులను రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో జనగణన–2027 తొలి విడత ఇండ్ల గణనను సమన్వయంతో, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ముఖ్య ప్రణాళిక అధికారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.












