జవహర్ నగర్ ప్రాంతంలోని 0-18 ఏళ్ల పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీత దయాకర్ పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో సీత దయాకర్ మాట్లాడుతూ, పిల్లల సంక్షేమం కోసం అన్ని శాఖలు అంకితభావంతో పనిచేయాలని, వారి సమస్యలను సొంత పిల్లలుగా భావించి పరిష్కరించాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లని, మధ్యలో చదువు మానేసిన పిల్లల వివరాలను సేకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఆధార్, జనన, కుల ధ్రువీకరణ పత్రాలు లేని పిల్లలకు కీసర ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అవసరమైన పత్రాలు అందించాలని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలని సూచించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, 'ఆపరేషన్ ముస్కాన్' తరహాలో డ్రైవ్ చేపట్టి బాల కార్మికులను గుర్తించాలని లేబర్ శాఖను ఆదేశించారు. బాల్య వివాహాలు, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ వంటి సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అంగన్వాడీల ద్వారా నిర్వహించే ఫ్యామిలీ సర్వే డేటాను క్రాస్-వెరిఫై చేసి, పిల్లల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్జీఓలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చారు.







