కామారెడ్డి, 29.06.2026
లడఖ్‌లోని 6,100 మీటర్ల ఎత్తైన కైగర్ రి పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం సన్మానించారు. బన్నీ జూన్ 14న పర్వతారోహణ ప్రారంభించి, జూన్ 19న శిఖరాన్ని చేరుకున్నాడు.
లడఖ్‌లోని 6,100 మీటర్ల ఎత్తైన కైగర్ రి పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి బన్నీ, జూన్ 14న పర్వతారోహణ ప్రారంభించి, జూన్ 19 ఉదయం 8 గంటలకు శిఖరాన్ని చేరుకున్నాడు. శిఖరంపై భారత జాతీయ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ (TTWREIS) కళాశాల ఫ్లెక్సీని ప్రదర్శించి దేశభక్తిని, కళాశాలపై అభిమానాన్ని చాటుకున్నాడు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ గతంలో కిలిమంజారో, కాంగ్ యత్సే పర్వతాలను కూడా అధిరోహించి తన సత్తా చాటుకున్నాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బన్నీ ఈ ఘనత సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు. బన్నీ సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని, అతను భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అతని విజయాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.











