Dr. B.R. Ambedkar Konaseema/Alamuru (ప్రశ్న ఆయుధం) జూన్ 29
భిక్నూర్ లోని 'శ్రీ చైతన్య విద్యానికేతన్ హై స్కూల్' ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పంచాయతీ ఆదాయానికి గండి కొడుతోందని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని సామాజిక కార్యకర్త బత్తుల భిక్షపతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి, పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
భిక్నూర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ, ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి పంచాయతీ ఆదాయానికి గండి కొట్టిన 'శ్రీ చైతన్య విద్యానికేతన్ హై స్కూల్' భాగోతం జిల్లా అత్యున్నత వేదికైన ‘ప్రజావాణి’ కి చేరింది. ఈ కార్పొరేట్ విద్యాసంస్థపై గతంలో గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసినా, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులను అడ్డుకున్నారని సామాజిక కార్యకర్త బత్తుల భిక్షపతి ఆరోపించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యంపై విసిగిపోయిన ఆయన, కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి (కలెక్టర్)ని కలిసి సాక్ష్యాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులో బత్తుల భిక్షపతి పాఠశాల యాజమాన్యం చేస్తున్న అక్రమాలను లెక్కలతో సహా వివరించారు. వారంతపు సంతకు వచ్చే రైతుల నుండి గంపకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తేనే సంవత్సరానికి పంచాయతీకి సుమారు 8 నుండి 10 లక్షల ఆదాయం వస్తుంది. గత 10 ఏళ్లలో 60 లక్షల ఆదాయం వచ్చింది. అలాంటిది, సంవత్సరంలో 200 రోజులకు పైగా స్థలాన్ని కమర్షియల్ అవసరాలకు వాడుకున్న ప్రైవేట్ స్కూల్ 15 ఏళ్లుగా ఒక్క రూపాయి పన్ను కట్టకుండా పంచాయతీ ఆదాయాన్ని దోచుకుందని పేర్కొన్నారు.
పాఠశాలలో దాదాపు 500 మంది పిల్లలు చదువుతుండగా, వారికి కేవలం 5 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు, ఆరోగ్య ముప్పు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం అర్హత లేని టీచర్లతో విద్యాబోధన సాగిస్తున్నారని, స్కూల్ ఆవరణలోనే పుస్తకాల దందా చేస్తూ సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మండల విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.
భిక్నూర్ లో సామాన్యుడికి ఒక న్యాయం, కార్పొరేట్ సంస్థలకో న్యాయం నడుస్తోందని స్థానిక రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సామాన్యుడు 500 రూపాయల ఇంటి పన్ను బకాయి పెడితే వసూలు చేసే అధికారులు, కోట్ల ఫీజులు గుంజే స్కూల్ యాజమాన్యానికి ప్రజా ప్రతినిధుల అండతో మినహాయింపులు ఇవ్వడంపై రైతులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 'లక్షలాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నుండి పంచాయతీ అధికారులు బకాయిలు వసూలు చేయకపోతే, భిక్నూర్ గ్రామంలోని రైతులు ఎవ్వరూ కూడా పంచాయతీకి పన్నులు కట్టడానికి సిద్ధంగా లేరు' అని స్పష్టం చేశారు. పేదవాడి గంపకు ఒక రూలు, ప్రైవేట్ సంస్థలకు ఒక రూలా అని ప్రశ్నిస్తున్నారు. రైతులు పన్నుల బంద్ పాటిస్తే గ్రామ పంచాయతీకి పెద్ద మొత్తంలో నష్టాలు వస్తాయి కాబట్టి, పన్ను వసూలు చేయాల్సిన పూర్తి బాధ్యత అధికారుల పైనే పడింది.











